Saturday, October 29, 2011

కోమలి-కేబ్-కేరాఫ్ ‘సఖ’-* మహిళా ‘కాబ్’ డ్రైవర్లు

న్యూఢిల్లీ లాంటి మహా నగరంలో మహిళలకు భద్రత లేదన్న నిజం తెలిసిందే. ప్రతిరోజూ పట్టణంలో ఏదో మూల ‘కాబ్’ డ్రైవర్ల వల్ల గానీ.. మగాళ్ల దాష్టీకానికి గానీ బలవుతున్న వారి సంఖ్య అంచనాకు మించి ఉంటున్నాయన్నదీ తెలిసిందే. ఆకతాయిల ఆగడాలనూ.. బస్సుల్లో వెకిలిచేష్ఠలనూ.. ‘స్కానింగ్’ కళ్ల నుంచీ.. యాసిడ్ అకృత్యాల నుంచీ తప్పించుకోటానికి ఇంటికే పరిమితమవుతున్న వారూ లేకపోలేదు. మరి ఇన్ని కారణాలూ అవాంతరాలనూ ఎదుర్కొని జీవితంలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్న న్యూఢిల్లీ ‘కాబ్’ వనితల కథ వింటే ఎవరికైనా నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిఖార్సయిన నిజం. ‘కాబ్’ డ్రైవర్ల (అందరూ దుష్టులూ దుర్మార్గులూ ఉంటారని కాదు) బారి నుంచీ మహిళలను రక్షించటానికి 2008లో ‘సఖ’ అనే సంస్థను మీనూ వధేరా స్థాపించింది. ‘కాబ్ సర్వీస్ రన్ బై ఉమెన్ ఫర్ ఉమెన్’ స్లోగన్‌తో ఆరంభమైన ఈ సంస్థ అనతికాలంలోనే మహిళలకు అతి చేరువైంది. ‘ఆజాద్ ఫౌండేషన్’ ద్వారా స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఈ ‘సఖ’లో సభ్యత్వం తీసుకున్న మహిళలకు ‘డ్రైవింగ్’లో శిక్షణ నివ్వటం.. బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా రుణ సౌకర్యం అందించటం చేస్తోంది. 4-6 ఆరునెలల మధ్య కాలంలో డ్రైవింగ్‌కి సంబంధించిన అన్ని అంశాలను బోధించటంతోపాటు - చిన్నచిన్న రిపేర్లు.. టైర్లు మార్చటం ఇత్యాదివి వాటిలో శిక్షణ నిస్తారు.
అమ్మాయి లకు డ్రైవింగ్ ఏం తెలుస్తుంది? అదీ ప్రొఫెషనల్‌గా అంటూ ఎగతాళి చేసిన వారి నోట ఇప్పుడు మాట లేదు. న్యూఢిల్లీ వీధుల్లో 2008లో అడపాదడపా కనిపించే మహిళా ‘కాబ్’ డ్రైవర్ల శాతం 2011 నాటికి గణనీయంగా పెరిగింది. ఈ కాబ్స్‌లో మహిళలకు మాత్రమే ప్రవేశం. ఈ రోజున ఒంటరిగా రోడ్డు మీద వెళ్లాలంటే భయపడే అమ్మాయిలు సైతం ముందుగా మహిళా ‘కాబ్’లను ఫోన్ ద్వారా సంప్రదించి సురక్షితంగా గమ్య స్థానాన్ని చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు కూడా కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్న మాట వాస్తవమని వారి లెక్కలే చెబుతున్నాయి.
‘సఖ’ ద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఈ సంస్థ చేస్తున్న సేవలకు గాను 2010లో ‘బిజినెస్ ఛాలెంజింగ్ అవార్డు’ రావటంతోపాటు 15 వేల యూరోలను గెలుచుకుని ఏ రంగంలోనైనా మహిళలు ధీటుగా నెగ్గుకు రాగలరని మరోమారు నిరూపించారు.
‘సఖ’ సిఒఒ నయనతార జనార్దన్ మాటల్లో వింటే - సమాజంలో ఎంతోమంది అట్టడుగు వర్గ మహిళలు ఏ ఉపాధిని ఎంచుకోవాలో తెలీక సతమత మవుతున్నారు. అదీగాక కూలీ ద్వారా వచ్చే మొత్తం అతి తక్కువ. కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోదు. అన్ని చోట్ల మగాళ్లదే రాజ్యం. వారు చెప్పినట్టు అణిగి మణిగి ఉండాల్సిందే. లేకుంటే తెల్లారి మరో కూలీ. ఇలా ఎన్నాళ్లు? అన్న ఆలోచన ఒకవైపు.. మహా పట్టణాల్లో ‘కాబ్’ డ్రైవర్ల అకృత్యాల నుంచీ మహిళలను రక్షించటానికి మహిళలే ముందంజ వేయాలన్న ఆలోచన మరోవైపు కలిసి -సఖ’ సంస్థను స్థాపించటానికి పునాదులు వేశాయి. ‘సఖ’లో చేరిన మహిళలు ఈ రోజు నెలకు 5 వేల నుంచీ 7 వేల వరకూ జీతభత్యాలను పొందుతున్నారు. సగటున ఇది చిన్న మొత్తం కావొచ్చు గానీ - రోజు గడవని పరిస్థితుల్లో ఆ మాత్రం ‘చేయూత’ అవసరం. మా వద్దకు వచ్చే ఒక్కో కథ వింటూంటే సమాజంలో మహిళలు ఎంతగా ఎదిగారని అనుకున్నా.. మనం ఇంకా ‘ఆటవిక’ పరిధిలోనే ఉండిపోయామన్నది తెలిసింది. మా వంతు సహకారం అందించటానికి మేం వేసిన మొదటి అడుగుకి మరిన్ని అడుగులు కలుస్తాయని ఆశిస్తున్నాం అంటున్నారు.

కార్తికం.. అత్యంత ఫలప్రదం

సూర్యుడు తులారాశిలో ప్రవేశించే ఈ కార్తికంలో సూర్యానుగ్రహంతో సర్వకార్యాలు నెరవేరుతాయని పురాణోక్తి. జనక వశిష్ఠుల సంభాషణలో వశిష్ఠులవారు ఓసారి కార్తిక పవిత్రత గురించి చెపుతూ ఈ మాసంలో ఏది దానం చేసినా దానికి రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చని అన్నారు. ఈ మాసంలో ఆచరించే నదీస్నానాలు అమోఘమైన ఫలితానిస్తాయి.
‘‘సర్వపాపహరం పుణ్యవ్రతం కార్తిక సంభవం
నిర్వఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే’’
అంటూ ముందుగా దామోదరుణ్ణి స్తుతించి నదీస్నానం చేయాలి. వాపీకూప తటకాది సమస్త సజ్జలాశయాలలోనూ విష్ణువు వ్యాపించి ఉంటాడు. కనుక ప్రాతఃకాలంలో ఎక్కడ స్నానం చేసినా శుద్ధాత్ములై శివునకు ప్రీతిపాత్రులవుతారు.
దేవతలకు, పితరులకు ఈ మాసంలో వదిలే తర్పణాలు అధిక ఫలాతాంశాన్ని ఇస్తాయ. అఘమర్షం మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని తొలిచి మూడు దోసెళ్ళనీళ్ళను గట్టుమీద పోసి తీరానికి చేరుకుని కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే ‘యక్షతర్పణం అంటారు. దుస్తులను ధరించి, సంధ్యావందన గాయత్రి జపాలనాచరించాలి. ఔపోసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి మంచి పుష్పాలతో శంఖ చక్రధారియైన విష్ణువును సభక్తికంగా పూజించాలి. కార్తిక పురాణ పఠనం చేయాలి. సాయంకాలం శివాలయంలోగాని వైష్ణవాలయంలోకాని యథాశక్తి దీపాలను పెట్టి శివకేశవులను అభేదంగా పూజించాలి.
ఇలా నెలంతా చేయలేని వారు కేవలం సోమవారాలు మాత్రం శివుని పూజించినా విశేష ఫలాలను పొందుతారు. అందుకే ఈ మాసంలో సోమవార వ్రతం అత్యంత ఫలదాయకమని అంటారు. కార్తిక సోమవార వ్రతం చేసినవారికి భగవంతుడు అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తాడని పురాణాలు చెప్తున్నాయి.
ఈ మాసంలో ఉపవాసాలు కూడా ప్రముఖమైనవే. ఇపుడు పగలల్లా ఉపవాసం చేయాలి. సాయంత్రం స్నానపానాదుల తర్వాత శివ వైష్ణవాలయాయ భేదం పాటించకుండా వారి వసతినిబట్టి ఆ కోవెలలో దీపారాధన చేయాలి. శివపూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి. ఇక ఇపుడు ఉపవాసదీక్షను విరమించి శివప్రసాదాన్ని భక్తియుక్తంగా సేవించాలి. ఇలా చేసిన వారికి ఈ లోకంలో సిరిసంపదలకు కొదువ ఉండదు. అంతేకాక శివసాయుజ్యం తప్పక దొరుకుతుందంటారు.
ఒంటిపూట భోజనం నక్తం, సోమవార వ్రతాల ఆచరణల కన్నా శివభక్తి ముఖ్యమన్నదే శివారాధన చేసినవారి కథల ద్వారా తెలుస్తుంది. మనసున భక్తి ప్రపత్తులు నెలకొంటే, పరులను హింసించకుంటే చాలు శరీరం మాలిన్యంతో నిండినా భోళాశంకరుడు తన భక్తులను ఎంతో ఆర్తిగా అక్కున చేర్చుకుంటాడు. నోరు తెరిచి శివా అని పిలిస్తే చాలు శివుడు ఆఘమేఘాలపై పరుగెత్తుకు వచ్చి తన భక్తులను ఆదుకొంటాడు. తన వారికి అఖండైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అందుకే శివుణ్ణి మంత్రయుక్తంగానో, గొప్ప నైవేద్యాలతోగాని ఆనందింపచేయనవసరం లేదు. అభిషేకప్రియుడైన శివుణ్ణి ఓ చెంబునీళ్లను తలపై పోస్తూ ఓం నమో నమశ్శివాయ అని మనసున తలిస్తే చాలు తన ఆపన్నహస్తంతో హరిహరుడు ఆదుకొంటాడు.
సోమవార వ్రతకథ: పూర్వం నిష్ఠాగరిష్ఠులైన దంపతులకు నిర్ఘరి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా అందమైంది దానికి తగ్గట్టు పొగరుపట్టిన నడత గలది. పైగా కాముకురాలు. వివాహం అయిన తర్వాత తమ కూతురి ప్రవర్తన బాగుంటుందని తలచిన తల్లితండ్రులు ఓ మిత్రశర్మ అనేవారికిచ్చి నిర్ఘరి వివాహం చేసారు. సద్గుణవంతుడు, సదాచార సంపన్నుడైన మిత్రశర్మ నిర్ఘరిని మార్చలేకపోయాడు. గుణాలవల్ల నిర్ఘరిని అందరూ కర్కశ అని పిలవడం మొదలెట్టారు. ఈ కర్కశ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. ఈ కర్కశ భర్త అమాయకత్వాని చూసి పర పురుషుల సాంగత్యంతో కాలం గడిపేది. ఇతర పుణ్యవంతులను కూడా పాపానికి పురికొల్పేది. భగవంతునిపై భక్తిని పెంచుకోమని చెప్పే భర్తను తన కార్యాకలాపాలకు అడ్డుగా ఉన్నాడనుకొంది. వెంటనే అతనిని అంతమొందించింది. తన ఇష్టప్రకారం తన కార్యాలను సాగించేది. ఇలా కాలం గడుపుతున్న కర్కశకు వృద్ధాప్యం వచ్చింది. దానికితోడు కుష్ఠువ్యాధి పీడితురాలు అయ్యింది. నానాబాధలు పడింది. చివరకు కాలంతీరింది. కర్కశ యమదూతలకు చిక్కింది. ఆమె చేసిన పాపాలకు వారు శిక్షలు వేసారు. ఆ శిక్షలను అనుభవించి ఎన్నో జన్మలను ఎత్తింది. కర్కశ 15వ జన్మగా ఓ శునకంగా ఓ బ్రాహ్మణుని ఇంట జన్మించింది. దొరికిన దానితో కాలం గడుపుతుండేది. ఆ ఇంట ఉన్న బ్రాహ్మణుడు ఓ కార్తికమాసంలో సోమవారం నాడు పగలల్లా ఉపవాసం చేశాడు. సాయంత్రం శివపూజచేసి నక్షత్ర దర్శనానంతరం బలిదానం చేసాడు. దానితో ఆ ఇంట ఉన్న శునకరూపంలోని కర్కశ దినమంతా అభోజనంగా ఉండిపోయింది. సాయంత్రపువేళ బలికి పెట్టిన అన్నాన్ని ఆబగా తినింది. ఆ సోమవార ఉపవాస ఫలితంగా ఆమెకు పూర్వ జన్మజ్ఞానం వచ్చింది. సర్వాన్ని గ్రహించింది. బ్రాహ్మణునికి తన విషయం అంతా వివరించింది. తనకు ఒక్కరోజు సోమవార వ్రతఫలాన్ని ఇవ్వమని వేడుకొంది. సహృదయుడు, శివభక్తుడైన ఆ బ్రాహ్మణుడు ఆ శునకానికి తాను ఆచరించి సంపాదించిన సోమవార వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. దాని ఫలితంగా ఆ కుక్కగా ఉన్న కర్కశ దేహాత్యాగం చేసి శివసాయుజ్యం పొందింది. ఈ వత్రం ఆచరించిన వారికి ఈ కథ విన్నవారికి కూడా పాపనాశం జరుగుతుందని ఈ సోమవార వ్రత ఫలితం చెప్తోంది. ఇలాంటి సోమవార వ్రతాన్ని అందరం ఆచరించి ముక్తిని పొందుదాం.
- దుర్గాప్రసాద్ ( ఆంధ్రభూమి నుండి )

Tuesday, October 11, 2011

భార్యలూ..జాగ్రత్త!

మన దేశంలో భర్తకు అహంకారం పాలెక్కువ. భార్యను ప్రేమించినా, అది బయటకు ఆమె వద్ద వ్యక్తపరచడు. కారణాలనేవి ప్రత్యేకంగా లేకపోయినా, కొంత భేషజం చూపించటానికే. అది చూసిన భార్య భర్తకు తనంటే ఇష్టం లేదని అనుకుని, తాను కూడా దూరంగా ఉంటుంది. నిజానికి భార్యాభర్తలు రబ్బర్ బ్యాండ్ లాంటివారు. దూరంగా వెళ్లినట్లు సాగినా, సమయం దొరికినప్పుడు దగ్గరై పోతారు. కొంతకాలానికి రబ్బర్ బ్యాండ్ టెన్షన్ కోల్పోయి లూజు అయినట్లు, వారిద్దరి మధ్య దూరం శాశ్వతమై పోతుంది.
భర్తల మూడ్స్, భార్య పట్ల ప్రవర్తన ప్రాంతాలనుబట్టి మారుతుంటాయి. అత్తవారింట్లో ఉన్నప్పుడు భార్యతో సరదాగా మాట్లాడినట్లుగా, తన తల్లిదండ్రుల ముందు మాట్లాడకపోవచ్చు. దానికేవో కారణాలుండొచ్చు. అటువంటి సందర్భంలో ఆయన్ను దోషిగా చూడకండి. మీ వారి మూడ్ బాగా ఉండే సమయాలేవో గుర్తించి, ముఖ్యమైన విషయాలు, ఆర్థిక విషయాలు చర్చించండి. మీ మనసులో అనుకున్న వెంటనే అడిగేయకండి. మీకు సమస్యలున్నప్పుడు, ముందుగా పిల్లల గురించి ప్రస్తావించండి. అప్పుడు ఉత్సాహంగా మాట్లాడతాడు. అప్పుడు మీ విషయం మెల్లగా చెప్పండి. పిల్లల ముందు ఆయనతో పోట్లాటకు దిగకండి. ఆయన చేయరాని పనులు, (విపరీతమైన తాగుడు, సిగరెట్లు, పేకాట) చేసినప్పుడు, పిల్లలతోనే చెప్పించండి. వెంటనే కాకపోయినా, తర్వాతనైనా మార్పు వస్తుంది. అప్పటికీ రాకపోతే మీరే తగిన విధంగా చెప్పండి.
మీకు ప్రేమతో బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు నవ్వుతూ థాంక్స్ చెప్పి తీసుకోండి. అంతేకాని.. అప్పుడివ్వలేదు. ఇప్పుడెందుకు? అని తూలనాడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని తల్లిని విమర్శించకండి. దాని ప్రభావం మరో విధంగా ఉంటుంది. ఎంతైనా తల్లికి కొడుకు మీదా, కొడుక్కి తల్లి మీద ప్రేమ ఉంటుంది. మీ భర్తను అమ్మాయిల విషయంలో అనుమానించవద్దు. మీ కళ్లతో మీరు చూసేదాకా త్వరగా ఏ నిర్ణయానికి రావొద్దు. ఎందుకంటే తాము తప్పు చేయకపోయినా, భార్య పదేపదే అనుమానిస్తుంటే, అది నిజమయ్యే ప్రమాదం ఉంది. తర్వాత మీరు చింతించినా ఏం ప్రయోజనం లేదు. ఆయనలో ఏదైనా ప్రతిభ ఉంటే గుర్తించి ‘నేను మీ ఫ్యాన్‌ని’ అని చెప్పండి. అలా అనిపించకపోయినా నటించండి. దాంతో మీ ఆయన బుట్టలో పడిపోతాడు. ఏదేమైనా భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యతగా ఉంటేనే సంసారం సజావుగా ఉంటుంది.